కలం, వెబ్ డెస్క్ : పొగాకు రైతుల సంక్షేమంపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలపై ఆధారపడినవని, రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు, గణాంకాలతో బహిరంగ చర్చకు రావాలని జగన్‌కి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) బహిరంగ సవాల్ విసిరారు. బుధవారం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ లో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.
గిట్టుబాటు ధరలు లేవని పొగాకు రైతుల్ని పరామర్శించేందుకు వెళ్తున్నట్లు జగన్ సరికొత్త డ్రామాలకు తెరలేపారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే.. 2019 నుంచి 2024 మధ్య కాలంలో పొగాకు రేట్లపైనా చర్చిద్ధామని జగన్‌కు సవాల్ విసిరారు. పొగాకు రైతులు సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ వారిని ఆదుకున్నది టీడీపీ నాయకత్వంలోని ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతిసారీ అండగా నిలిచి నిర్ణయాలు తీసుకున్న చరిత్ర టీడీపీ ప్రభుత్వానిదేనని తెలిపారు. గత సంవత్సరం బర్లీ పొగాకు రైతుల నుంచి 25 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసి, సుమారు రూ.280 కోట్లు వెచ్చించడం జరిగిందని వెల్లడించారు.
2014–15లో ఎఫ్‌సీవీ పొగాకు ధరలు పడిపోయినప్పుడు, వాణిజ్య పంట అయినప్పటికీ రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రతి కిలోకు రూ.20 ఆర్థిక సహాయం అందించడం జరిగిందని.. చరిత్రలోనే ఇది ఒక కీలక నిర్ణయమని పేర్కొన్నారు. అయితే, వైసీపీ హయాంలో 2019లో సుమారు 124 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి కాగా, ధర కిలోకు రూ.121–123కు పడిపోయిందని… అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం కేవలం 11.8 మిలియన్ కిలోలను మాత్రమే కొనుగోలు చేసి, మిగిలిన రైతులను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. తదుపరి సంవత్సరం సుమారు 128 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయి, ధర కిలోకు రూ.123కు పడిపోయినప్పటికీ, జగన్ ప్రభుత్వం ఒక్క కిలో కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. రైతులకు ఎలాంటి అదనపు ఆర్థిక సహాయమూ అందించలేదని ఫైర్ అయ్యారు.
పొగాకు ధరల విషయంలో కూడా వాస్తవాలు ప్రజల ముందున్నాయన్న మంత్రి అచ్చెన్నాయుడు.. 2019లో కేజీ రూ.142, 2020లో రూ.140, 2021లో రూ.161, 2022లో రూ.192, 2023లో రూ.248, 2024లో కూటమి ప్రభుత్వ హయాంలో రూ.326, 2025లో రూ.300, 2026లో రూ.275 లు ఉందని గణాంకాలను తెలియజేశారు. ప్రస్తుత సంవత్సరం టొబాకో బోర్డు లక్ష్యం 131 మిలియన్ కిలోలు కాగా, రైతులు సుమారు 241 మిలియన్ కిలోలు ఉత్పత్తి చేశారని తెలిపారు. అధిక ఉత్పత్తితో ఇబ్బందులు ఎదురైన రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం వెంటనే ముందుకొచ్చిందని స్పష్టం చేశారు.
సుమారు 100 మిలియన్ కిలోల పొగాకుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కిలోకు రూ.10 చొప్పున మొత్తం రూ.100 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిందని వివరించారు. ఈ సహాయం పంపిణీని రేపటి నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పారు. అంతేకాదు అంచనాకు మించి పొగాకు వచ్చినా, దానికి కూడా ప్రతి కిలోకు రూ.10 చొప్పున సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతోపాటు, కేంద్ర ప్రభుత్వం ప్రతి పొగాకు బ్యారన్‌కు రూ.50,000 వడ్డీలేని రుణం అందిస్తోందని తెలిపారు. ఈ వాస్తవాలన్నింటి తర్వాత కూడా పొగాకు రైతుల గురించి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వ పనితీరు, కూటమి ప్రభుత్వ సహాయంపై గణాంకాలతో బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాలు చేస్తున్నామన్నారు. రైతులు గత ప్రభుత్వ పనితీరును, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని పోల్చి చూడాలని… ఎవరు రైతులను గాలికి వదిలేశారో, ఎవరు కష్టకాలంలో అండగా నిలిచారో ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

