కలం , మహబూబ్‌నగర్ బ్యూరో : సమగ్ర శిక్షణతోనే సత్ఫలితాలు సాధ్యమవుతాయని మహబూబ్‌నగర్ (Mahabubnagar) ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ అన్నారు. మంగళవారం నాడు ఆయన మహబూబ్‌నగర్ ఫస్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8, 9, 10 తేదీల్లో శిక్షణా కేంద్రంలో నిర్వహించబడుతున్న విద్య వాలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ డిఈఓ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని ఆయన తెలిపారు.
కాగా, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో విద్యా రంగ అభివృద్ధికి కట్టుబడి చేపట్టిన ‘శతశాతం’ కార్యక్రమం ప్రస్తుతం మహబూబ్ నగర్ నియోజకవర్గంలో విశేష ఫలితాలను అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో, ప్రత్యేక పరీక్ష ద్వారా ప్రతిభావంతులైన విద్యా వాలంటీర్లను ఎంపిక చేయడం జరిగింది. ఈ వాలంటీర్లకు బోధనా నైపుణ్యాలు, విద్యార్థులతో మెలగే విధానం, పాఠ్యాంశాల లోతైన అవగాహన వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఈ మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో నిష్ణాతులైన అధ్యాపకుల బృందం పాల్గొని, ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ టూల్స్ వినియోగం, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, పరీక్షల సిద్ధత వంటి కీలక అంశాలపై సమగ్ర మార్గదర్శకత్వం అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి, విద్యా వాలంటీర్లకు ప్రోత్సాహం ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి గారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ డుంకుడు శ్రీనివాస్, వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ టి. రవీందర్ రెడ్డి, జీహెచ్‌ఎంలు బాలు యాదవ్, ఆనంతప్ప, హెచ్‌ఎం హరినాథ్, రాజు నాయక్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

