కలం, నిర్మల్: ఈ నెల 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అంగన్‌వాడీ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు సునీత అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో అంగన్‌వాడీ యూనియన్ (Anganwadi Workers) జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం, పీఎంశ్రీ వంటి విధానాల ద్వారా విద్యా రంగంతోపాటు ఐసీడీఎస్ వ్యవస్థను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.
అంగన్‌వాడీ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రస్తుతం స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్న టీచర్లు, ఆయాలను కార్మికులుగా గుర్తించాలని కోరారు. ఈ సమావేశంలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి. లలిత, జిల్లా కార్యదర్శి శైలజ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు.

