కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal)జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. స్థానిక డాక్టర్స్ లైన్, తిరుమల థియేటర్ ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిలిచి రహదారులపై ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. వాహనదారులు లైట్లు వెలిగించుకుని నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

