కలం, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే (Ajinkya Rahane) వీడ్కోలు చెప్పడంతో మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదే బీసీసీఐ పెన్షన్ పథకం. 25కిపైగా టెస్టులు ఆడిన రహానే.. అత్యధిక పెన్షన్ కేటగిరీలోకి చేరాడు. నెలకు రూ.70 వేలు పెన్షన్‌గా రహానే పొందనున్నాడు. దీంతో మాజీ క్రికెటర్లకు బీసీసీఐ ఎంత పెన్షన్ ఇస్తుంది? ఎవరు అర్హులు? అనే చర్చ మొదలైంది. ప్రపంచ క్రీడల్లో మాజీ ఆటగాళ్లకు నెలవారీ పెన్షన్ ఇవ్వడం చాలా అరుదు. కానీ బీసీసీఐ ఈ పథకాన్ని 2004లోనే ప్రారంభించింది.
క్రిక్‌ఇన్‌ఫో నివేదిక ప్రకారం.. అప్పట్లో 174 మంది మాజీ క్రికెటర్లు, అధికారులకు నెలకు రూ.5 వేల పెన్షన్ మంజూరు చేశారు. కనీసం ఒక టెస్టు మ్యాచ్ ఆడిన వారికి మాత్రమే ఈ అర్హత ఉండేది. 2022లో బీసీసీఐ పెన్షన్ మొత్తాలను పెంచింది. అప్పటి కార్యదర్శి జై షా.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల సంక్షేమమే తమ ప్రాధాన్యమని చెప్పినట్లు వెల్లడైంది. అంపైర్ల సేవలకు గుర్తింపుగా వారికి ఈ పథకాన్ని వర్తింపజేసినట్లు తెలిపారు.
ఈ నిర్ణయంతో దాదాపు 900 మంది లబ్ధి పొందగా, వారిలో 75 శాతం మందికిపైగా పెన్షన్ రెట్టింపైనట్లు సమాచారం. ప్రస్తుతం 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన మాజీ క్రికెటర్లకు నెలకు రూ.70 వేల పెన్షన్ లభిస్తుంది. ఇతర మాజీ టెస్టు క్రికెటర్లకు రూ.60 వేలు చెల్లిస్తారు. మాజీ మహిళా అంతర్జాతీయ క్రికెటర్లకు రూ.52,500 అందుతుంది. ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు ఈ పథకం వర్తిస్తుంది. 2003కు ముందు రిటైర్ అయిన వారికి నెలకు రూ.45 వేల పెన్షన్ ఇస్తారు.
ఇతర మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లకు రూ.30 వేల చెల్లిస్తారు. పలు నివేదికల ప్రకారం.. ఈ పెన్షన్ జీవితాంతం కొనసాగుతుంది. అయితే బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘంలో జీతభత్యాలతో కూడిన పదవిని చేపడితే.. ఆ కాలంలో మాత్రమే పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. బాధ్యతలు ముగిసిన తర్వాత మళ్లీ కొనసాగుతుంది.

