కలం, వనపర్తి: వర్షాకాలం వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వనపర్తి డీఎంహెచ్ఓ (Wanaparthy) సాయినాథ్‌రెడ్డి అన్నారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా లాంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ అధ్యక్షతన నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో కీలక విషయాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా-శిశు ఆరోగ్య సేవలు, సాధారణ టీకాలు, నులిపురుగుల నివారణ, కుటుంబ నియంత్రణ, అసంక్రమిత వ్యాధులు లాంటి అంశాల పనితీరుపై సమగ్రంగా సమీక్షించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కూలర్లు, వాటర్ ట్యాంకులు, డబ్బాలు, పాత టైర్లలో నిల్వ ఉన్న నీటిని వారానికి ఒకసారి శుభ్రం చేయాలని సూచించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుని, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వంద శాతం టీకాకరణ పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. భాస్కర్ నాయక్, టీబీ నోడల్ అధికారి డా. వంశీ, డీఐఓ డా. పరిమళ, ఎన్‌సీడీ నోడల్ అధికారి డా. మారుతి నందన్, ఎపిడెమియాలజిస్టు సుమిత్‌రెడ్డి పాల్గొన్నారు.

