ప్రజావాణిలో నిర్లక్ష్యం.. పెండింగ్‌లో 50 శాతానికి పైగా అప్లికేషన్లు

కలం, వెబ్ డెస్క్: ప్రజాసమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజావాణి’ (Prajavani Grievances) కార్యక్రమాన్ని ప్రారంభించింది. చిన్న చిన్న సమస్యలకూ ప్రజలు రాజధాని హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం ఉండొద్దని జిల్లా కేంద్రాల్లోనూ మొదలుపెట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం అన్ని కలెక్టరేట్లలో ‘ప్రజావాణి’ జరుగుతున్నది. ప్రజల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. కానీ వాటిని పరిష్కరించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజావాణి ఫిర్యాదుల్లో 50 శాతం కూడా పరిష్కారం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల చుట్టూ ఏండ్లకేండ్లు తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఒక్క సమస్య పరిష్కారం కోసం 10 నుంచి 15సార్లు ప్రజావాణికి రావాల్సి వస్తున్నదని బాధితులు వాపోతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం..

పింఛన్లు, ఇళ్లు, భూవివాదాలు.. లాంటి సమస్యలతో బాధితులు ఎక్కువగా ప్రజావాణికి వస్తున్నారు. కానీ ప్రతివారం అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండడం లేదు. ఒకవేళ వచ్చినా.. టైమ్‌కు రావడం లేదు. పోనీ ఆలస్యంగా వచ్చినా సమస్యలు పరిష్కరిస్తారా? అంటే అదీ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదో తూతూమంత్రంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారని, నామ్‌కే వాస్తే ప్రోగ్రామ్‌గా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని సోమవారం కలం టాస్క్‌ఫోర్స్ ప్రత్యేకంగా పరిశీలించింది. ఇందులో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదీ పరిస్థితి..

ప్రజావాణికి వస్తున్న బాధితులకు కలెక్టరేట్లలో కనీస సౌలతులూ కల్పించడం లేదు. తాగు నీరు, బాత్‌రూమ్స్ అందుబాటులో ఉండడం లేదు. కుర్చీలు కూడా లేక గంటల తరబడి నిల్చోవాల్సి వస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో గత ఆరు నెలల్లో 889 దరఖాస్తులు వస్తే, ఇప్పటి వరకు 281 ఫిర్యాదులు మాత్రమే పరిష్కారమయ్యాయి. కరీంనగర్‌‌లో కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి ఉదయం 10:30 గంటలు దాటినా అధికారులు హాజరుకాలేదు. 11 గంటలకు కార్యక్రమం మొదలైంది. సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణికి అధికారులకు బదులు వాళ్ల ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది హాజరయ్యారు. కొందరు అధికారులు వివిధ కారణాలు చూపుతూ డుమ్మా కొడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>