నీరజ్ చోప్రా సలహాతోనే పతకం సాధించా: యశ్‌వీర్ సింగ్!

కలం, స్పోర్ట్స్ : గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో (Commonwealth Games 2026) భారత జావెలిన్ త్రోయర్ యశ్‌వీర్ సింగ్ (Yashvir Singh) సంచలనం సృష్టించారు. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఇచ్చిన ఆఖరి క్షణపు సలహాను పాటించి కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సాధించారు. ఐదో రౌండ్ ముగిసే సమయానికి యశ్‌వీర్ సింగ్ 81.33 మీటర్ల త్రోతో ఏడో స్థానంలో ఉన్నారు. అదే సమయంలో సౌతాఫ్రికా ఆటగాడు డౌ స్మిత్ 82.88 మీటర్ల త్రోతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సమయంలో నీరజ్ చోప్రా యశ్‌వీర్‌కు కీలక సూచనలు చేశారు. ఈటెను ఒకే సరళ రేఖలో ఉంచి విసరాలని, సాంకేతికతపై దృష్టి పెట్టాలని నీరజ్ సూచించారు. ఆ సలహాను పాటించిన యశ్‌వీర్ ఆరో రౌండ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి 85.41 మీటర్ల త్రో నమోదు చేశారు. దీంతో తన కెరీర్‌లోనే అత్యుత్తమ రికార్డు సాధించడంతో పాటు కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు.

ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం అందుకున్న అనంతరం యశ్‌వీర్ మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితులను అధిగమించి పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పెద్ద టోర్నీ కావడంతో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జావెలిన్ త్రోలో సాంకేతికత చాలా కీలకమని పేర్కొన్న యశ్‌వీర్.. ఈటెను భుజానికి సమాంతరంగా, ఒకే రేఖలో ఉంచడం వల్ల ఎక్కువ దూరం విసరగలమని వివరించారు. నీరజ్ చోప్రా సూచించిన విధంగానే ఈటెను చెవి వద్ద పట్టుకుని, భుజాల కదలికలను సరిచేసుకుని త్రో చేసినట్లు తెలిపారు. స్టార్ ఆటగాళ్లు నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్, రుమేష్ పతిరాగే, ఆండర్సన్ పీటర్స్‌పై అందరి దృష్టి ఉండటంతో తనపై ఒత్తిడి లేదని యశ్‌వీర్ చెప్పారు. తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనపైనే దృష్టి పెట్టానని, దేవుడి దయతో అది సాధ్యమై కాంస్య పతకం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>