కలం, నిర్మల్: దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను మామడ పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ సోమవారం వెల్లడించారు. గత జూన్ నెలలో మామడ (Mamda Police) పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా నిజామాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన సతీష్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.21 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు నిర్మల్ జిల్లాలోని మామడ మండలంలో రెండు, లక్ష్మణచందా మండలంలో రెండు, ఖానాపూర్ ఓ ఆలయంలో, నిజామాబాద్ జిల్లాలో ఏడు ఆలయాల్లో చోరీలు చేశాడు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, మామడ ఎస్సై హన్మండ్లు, సోన్ ఎస్సై గోపిని జిల్లా ఎస్పీ అభినందించారు.

