ప్రాజెక్టుల క్లియరెన్స్‌కు కౌంట్‌డౌన్.. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam) అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, డిండి , గౌరవెల్లి ప్రాజెక్టుల పురోగతిపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతుల ప్రక్రియను అత్యంత వేగవంతం చేయాలని, రాబోయే ఆరు నెలల్లోగా అన్ని రకాల క్లియరెన్సులు సాధించడమే లక్ష్యంగా నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు వెల్లడించారు.

పర్యావరణ అనుమతుల సాధనలో భాగంగా రాబోయే 30 రోజుల్లోగా సమగ్ర పర్యావరణ నివేదికలు సిద్ధం చేయాలని, తదుపరి 60 రోజుల్లోగా దరఖాస్తుల ప్రక్రియను పూర్తిగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల క్లియరెన్స్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఎన్జీటీ , సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక లీగల్ టీమ్‌తో నిరంతరం సమన్వయం చేసుకుంటూ బలమైన వాదనలు వినిపించాలని ఆదేశాలు జారీ చేశారు.

గౌరవెల్లి పంప్‌హౌస్ పనులను వేగంగా పూర్తి చేసి తక్షణమే సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అలాగే, సీతారామ ప్రాజెక్టు పనులను మళ్లీ పునఃప్రారంభించేందుకు అన్ని సన్నాహాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై తక్షణమే సమగ్ర అధ్యయనం చేయాలని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నష్టపరిహారంపై కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపించేందుకు ఇప్పటి నుంచే నివేదికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>