దారి తప్పిన పాక్ జావెలిన్ స్టార్.. కోచ్‌ల విమర్శలు

కలం, స్పోర్ట్స్: ఒలింపిక్ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్‌పై (Arshad Nadeem) అతని గురువులే తీవ్ర విమర్శలు గుప్పించారు. శిక్షణలో నిర్లక్ష్యం, ఆటపై ఏకాగ్రత తగ్గడమే కామన్వెల్త్ గేమ్స్ వైఫల్యానికి కారణమని తేల్చిచెప్పారు. పారిస్ ఒలింపిక్స్‌లో 92.97 మీటర్ల త్రోతో చరిత్ర సృష్టించిన నదీమ్.. గ్లాస్గోలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. క్వాలిఫయింగ్‌లో 78.63 మీటర్లు విసిరి కష్టంగా ఫైనల్ చేరాడు. ఫైనల్లో 77.41 మీటర్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. నదీమ్ ఎదుగుదలకు తోడ్పడిన అక్రమ్ సాహీ.. ఒలింపిక్స్ తర్వాత అతడి చుట్టూ ఓ వర్గం చేరిందని విమర్శించారు.

దీంతో తన వద్దకు రాకుండా చేశారని చెప్పారు. గత కొన్ని నెలలుగా శిక్షణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపించిందని వ్యాఖ్యానించారు. మరో గురువు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. హజ్ యాత్ర తర్వాత నదీమ్ సరైన శిక్షణ తీసుకోలేదన్నారు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు దక్షిణాఫ్రికాలో తీసుకున్న కఠిన శిక్షణే అతడికి స్వర్ణం అందించిందని గుర్తు చేశారు. ఒలింపిక్స్ తర్వాత వచ్చిన భారీ నగదు బహుమతులను తన శిక్షణ కోసం వినియోగించకుండా.. ఇతర విషయాలపై దృష్టి పెట్టాడని విమర్శించారు.

స్వస్థలంలో మ్యారేజ్ హాల్, రెస్టారెంట్ నిర్మాణ పనులు కూడా ఆటపై ప్రభావం చూపాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అతడితో ఉన్న కోచ్‌కు జావెలిన్‌లో సరైన అనుభవం లేదని కూడా గురువులు వ్యాఖ్యానించారు. మెరుగైన విదేశీ కోచ్, ఉన్నత స్థాయి శిక్షణ ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. అర్షద్ ప్రదర్శనపై అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేశారు. భారీ నగదు బహుమతుల కంటే ప్రపంచస్థాయి శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>