కరీంనగర్ అభివృద్ధే లక్ష్యం: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: అభివృద్ధిలో కరీంనగర్ (Karimnagar) కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టడమే తన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తెలిపారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని 24వ డివిజన్ బ్యాంక్ కాలనీలో రూ.50 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

అనంతరం కిసాన్ నగర్‌లోని పోచమ్మ ఆలయాన్ని సందర్శించిన బండి సంజయ్ (Bandi Sanjay) ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. బోనాలు కేవలం ఒక జాతర మాత్రమే కాదని, భక్తి, శక్తి, సంప్రదాయాల సమ్మేళనమని పేర్కొన్నారు. ఆషాఢ మాసంలో జరిగే ఈ ఉత్సవాలు తెలంగాణ ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నాయని తెలిపారు.

బోనాలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, జానపద కళలు, కుటుంబ బంధాలు, మహిళా శక్తిని ప్రతిబింబించే గొప్ప పండుగ అని బండి సంజయ్ అన్నారు. ఆధునికీకరణ పెరుగుతున్నప్పటికీ పట్టణ, గ్రామీణ సంప్రదాయాలను కాపాడుకుంటూ బోనాల పండుగను నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు.  “బోనం అనేది కుండలో వండిన అన్నం మాత్రమే కాదు.. అమ్మవారి పట్ల భక్తులకున్న అపారమైన ప్రేమకు ప్రతీక. పోతురాజు నృత్యం కేవలం వినోదం కాదు.. గ్రామాల రక్షణ, వీరత్వానికి చిహ్నం” అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని బండి సంజయ్ కోరారు.

Also Read : రెండు నెలలైనా అంతుచిక్కని సంగీత హత్య కేసు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>