కలం, కరీంనగర్ బ్యూరో: సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను నమ్మించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, రానున్న రోజులలో అదే సోషల్ మీడియా వేదికగా ప్రజలు వాస్తవాలను గుర్తించి బీజేపీకి గుణపాఠం చెబుతారని సిపిఐ (CPI) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas) అన్నారు. చిగురుమామిడి మండలంలోని ముస్కు రాజిరెడ్డి స్మారక భవన్‌లో ఆదివారం నిర్వహించిన సిపిఐ మండల కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార యాత్రలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు జరిగే ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించే యాత్రలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తోందని శ్రీనివాస్ (Panjala Srinivas) ఆరోపించారు. దేశ అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలుపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగి సామాన్య ప్రజలపై భారం పడుతోందని విమర్శించారు. కోట్లాది మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్న బీజేపీపై యువతలో అసంతృప్తి పెరుగుతోందని అన్నారు.
రైతుల పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, ధరల పెరుగుదలను నియంత్రించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని, దళిత, ఆదివాసీలపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 14 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రచార యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి మాట్లాడుతూ.. చిగురుమామిడి మండలంలో ఈ నెల 8, 9 తేదీలలో ప్రచార యాత్ర జరుగుతుందని, ప్రతి కార్యకర్త దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు గూడెం లక్ష్మీ, చాడ శ్రీధర్ రెడ్డి, అందె చిన్నస్వామి, బోయిని వల్లభాయ్ పటేల్, మావురపు రాజు తదితరులు పాల్గొన్నారు.
Also Read : రామ్‌కుమార్ రామనాథన్ జోరు.. బాన్ ఓపెన్-2026 డబుల్స్ టైటిల్ కైవసం!
Follow Us On : WhatsApp

