కలం, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లాలో అచ్చం పుష్ప సినిమాను తలపించేలా సాగుతున్న గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టయింది. ఒక రోడ్డు ప్రమాదం కారణంగా భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టు బయటపడింది. దగదర్తి (Dagadarthi) మండలం సున్నపబట్టి వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక బొలెరో మాక్స్ వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే వాహన డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న హైవే మొబైల్ సిబ్బంది అనుమానంతో సదరు వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వాహనం లోపల అమర్చిన ఒక ప్రత్యేక రహస్య అర బయటపడింది. పోలీసులు దానిని తెరవగా లోపల ఉన్న గంజాయి ప్యాకెట్లను చూసి కంగుతిన్నారు.
ఈ గంజాయిని వైజాగ్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి బరువు సుమారు వెయ్యి కేజీలకు పైగానే ఉంటుందని, దీని మార్కెట్ విలువ లక్షల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పోలీసులు గంజాయిని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ప్రమాదం తర్వాత పరారైన డ్రైవర్ తో పాటు ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Also Read : ఏపీ ప్రభుత్వానికి ఆక్వా రైతుల వార్నింగ్
Follow Us On : WhatsApp

