కలం, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర (Bonalu Festival) ఈ రోజు నుంచే ప్రారంభమైంది. భారీగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అమ్మవారి ఆలయం చుట్టూ మూడంచెల భద్రతతో మొత్తం 2,500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నపట్లు వివరించారు. అంతేగాకుండా పరిసరాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.
తన కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న సీపీ సజ్జనార్.. ప్రత్యేక బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వివరించారు. పోలీస్ శాఖతో సహా దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీ తదితర శాఖల సమన్వయంతో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఆలయానికి రాబోతున్న ప్రముఖులు..
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకోబోతున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు పార్టీ నేతలు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.హనుమంతరావు తదితరులు ఉదయమే దర్శించుకున్నారు. గద్దర్ కుమార్తె వెన్నెల గద్దర్ సాంస్కృతిక సారధి తరఫున 150 మట్టి బోనాలు సమర్పించారు.

