కలం, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ పరిధిలోని చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు (Secunderabad Bonalu) అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. లష్కర్ బోనాల జాతరను పురస్కరించుకుని ఆలయ అధికారులు తెల్లవారుజామున 4:05 గంటలకే ఆలయ ద్వారాలను తెరిచారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, రంగురంగుల పుష్పాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తడంతో పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని సంప్రదాయబద్ధంగా తొలి బోనం సమర్పించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల పటిష్ట ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు.

