ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు

కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ (Yellampalli Project)ను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ రైతులకు అత్యధిక స్థాయిలో సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గోదావరి నదిపై వివిధ ప్రాజెక్టులను పరిశీలిస్తూ నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా రైతులకు సాగునీరు అందిస్తుండగా, గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు దెబ్బతిన్నాయని విమర్శించారు.

కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్ట్ పూర్తి..

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో మెజార్టీ పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్ వివరించారు. ఈ ప్రాజెక్టుకు దివంగత శ్రీపాదరావు పేరు పెట్టడం పెట్టామని గుర్తు చేశారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదన్నారు.

జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని లిఖితపూర్వకంగా సూచించిందని తెలిపారు. ఇటీవల జరిగిన సాంకేతిక సమావేశంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), ఎన్‌డీఎస్‌ఏ అధికారులు కూడా నిపుణుల కమిటీ సూచనల మేరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారని పేర్కొన్నారు. డీపీఆర్ ప్రకారం షీట్‌ ఫైల్ ఫౌండేషన్ నిర్మించాల్సి ఉండగా, స్కాంట్ ఫైల్ ఫౌండేషన్ నిర్మించారని వివరించారు.

నిపుణుల కమిటీ సూచనల మేరకు..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల నాణ్యతపై నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనల మేరకు మూడు బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు గంట గంటకు నీటిని ఎత్తిపోస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం నీటిపారుదల రంగంపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, గడ్డం వినోద్ కుమార్, వెడ్మ బొజ్జు , మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>