కలం, వెబ్‌డెస్క్: జైస్మిన్ లంబోరియా (Jasmine Lamboria) .. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణాన్ని అందించారు. కొన్ని వారాల క్రితం వరకు కూడా ఆసుపత్రి బెడ్‌కే పరిమితమైన జైస్మిన్.. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ మైకేలా వాల్ష్‌ను ఓడించి మహిళల 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. మహిళల 57 కేజీల ప్రపంచ ఛాంపియన్ అయిన జైస్మిన్‌కు ఈ స్వర్ణం ఎంతో ప్రత్యేకం. నెలల తరబడి ఎదుర్కొన్న అనారోగ్యం, గాయాలు, మానసిక ఒత్తిడిని అధిగమించిన తర్వాత ఆమె ఈ విజయాన్ని అందుకుంది.
ఆసియా చాంపియన్‌షిప్‌లోనే ఆమె కష్టాలు మొదలయ్యాయి. తొలి బౌట్ తర్వాతే తీవ్ర జ్వరం వచ్చింది. అయినా పోటీని వదల్లేదు. మూడు కఠినమైన బౌట్లు ఆడి ఫైనల్ చేరింది. సెమీఫైనల్‌లో 3-2తో గెలిచి చివరకు రజత పతకం సాధించింది. అదే కామన్వెల్త్ గేమ్స్‌కు నేరుగా అర్హత తెచ్చిపెట్టింది. ఆ టోర్నీ ఫైనల్లో తలకు బలమైన దెబ్బ తగిలి కన్‌కషన్‌కు గురైంది. వైద్య పరీక్షల్లో ఎలాంటి ప్రమాదం లేదని తేలింది.
భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత మరోసారి తీవ్ర జ్వరం వచ్చింది. సుమారు 20 రోజుల సాధన తర్వాత ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. తనకు వచ్చిన అనారోగ్యం ఏమిటో కూడా తెలియలేదని, త్వరగా కోలుకోవాలనే ఆశ మాత్రమే ఉందని అప్పట్లో తెలిపింది. ఆ కారణంగా చెక్ రిపబ్లిక్‌లో జరిగిన భారత శిక్షణ శిబిరాన్ని కూడా ఆమె కోల్పోయింది. దీంతో కామన్వెల్త్ గేమ్స్ సన్నాహకాలు దెబ్బతిన్నాయి.
ఈ పరిస్థితులు మానసికంగానూ ప్రభావం చూపాయి. ప్రతికూల ఆలోచనలు వచ్చినా, స్పోర్ట్స్ సైకాలజిస్టు, కోచ్‌ల మద్దతుతో మళ్లీ ఆత్మవిశ్వాసం పెంచుకుంది. ఫలితం గురించి ఆలోచించకుండా ముందుగా పూర్తిగా కోలుకోవాలని కోచ్‌లు సూచించినట్లు తెలిపింది. జూలై 1 నుంచే మళ్లీ శిక్షణ ప్రారంభించింది. కామన్వెల్త్ గేమ్స్‌కు నెల రోజుల ముందు మాత్రమే పూర్తి స్థాయిలో సాధన చేసే అవకాశం దక్కింది.
అయినా గ్లాస్గోలో అంచనాలకు తగ్గట్టే రాణించింది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ మైకేలా వాల్ష్‌ను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. బర్మింగ్‌హామ్‌లో గెలిచిన కాంస్యాన్ని ఈసారి స్వర్ణంగా మార్చుకుంది. విజయం తర్వాత స్పందించిన జైస్మిన్… పతక రంగు మార్చాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగానని తెలిపింది. భారత్‌కు స్వర్ణం అందించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది.

