కలం , మహబూబ్నగర్ బ్యూరో : సమాజంలో ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన వారు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతారని ప్రముఖ సైకాలజిస్ట్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం ఏ కరీం అన్నారు. శనివారం మహబూబ్నగర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర సైకలాజికల్ అసోసియేషన్ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఈనెల 4 నుండి 10వ తేదీ వరకు మానసిక ఆరోగ్య భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన (Mental Health Awareness) కల్పిస్తామన్నారు.
ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన వారిలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య అవసరాల దృష్ట్యా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఏదో ఒక రూపాలలో మానసిక సమస్యను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. ఈ తరుణంలో సమాజంలోని వివిధ వర్గాల వారిని మానసికంగా బలోపేతం చేయడానికి తనవంతు బాధ్యతగా సైకాలజిస్టులు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మానసిక ఆరోగ్య భద్రతా వారోత్సవాలలో భాగంగా 4న బాల బాలికలకు బాల్యదశ ప్రాముఖ్యత అంశాలు, 5న విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాపకశక్తి ఏకాగ్రత చదువు పట్ల ఆసక్తి లేకపోవడం వంటి విషయాలపై మానసిక నిపుణులు సలహాలు సూచనలు అందిస్తారని చెప్పారు. 6న యువతి యువకులకు భవిష్యత్తు పట్ల లక్ష్య నిర్దేశం, 7న బాలికలు, స్త్రీల మానసిక సమస్యలకు, 8న పిల్లల పెంపకం పై తల్లిదండ్రులకు అవగాహన, 9న కుటుంబ వ్యక్తిగత మానసిక సమస్యలు వాటి పరిష్కారాలు, 10న వృద్ధులకు వృద్ధాప్య మానసిక ఆరోగ్య సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మానసిక నిపుణులు వ్యక్తిగత కన్సల్టేషన్, కౌన్సిలింగ్ ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఈ సదుపాయము ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉచితముగా అందుబాటులో ఉంటుంది. జిల్లా, స్థానిక సమాచారం కోసం 9440488571 , అసోసియేషన్ కేంద్ర కార్యాలయము హెల్ప్ లైన్ కోసం 040-35717915 నంబర్లను సంప్రదించాలని సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఏ.కరీం తెలిపారు.

