కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం, దాని పరిసర ప్రాంతాలను ముంచెత్తుతున్న గోదావరి వరద ఉద్ధృతి కేవలం ప్రకృతి ఉప ద్రవం మాత్రమే కాదని, దిగువన ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావమే ప్రధాన కారణమని బీఆర్‌ఎస్ నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే భద్రాద్రి ప్రాంత ప్రజలు ప్రతి ఏటా వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
భద్రాచలం ప్రాంతంలో ప్రస్తుతం ఏర్పడిన వరద పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిలో వరద వచ్చిన ప్రతిసారి పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) వల్ల నీరు వెనక్కి తన్ని భద్రాచలం పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు జలమయం అవుతున్నాయని పువ్వాడ వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని, ఇది కేవలం నదీ ప్రవాహ ఉద్ధృతి వల్ల మాత్రమే జరుగుతున్నది కాదని స్పష్టం చేశారు. వరదలు వచ్చి ప్రజల ఇళ్లు, ఆస్తులు మునిగిపోతున్న వేళ అధికారులు, ప్రభుత్వాలు కేవలం తాత్కాలిక సహాయక చర్యలకే పరిమితమవుతున్నాయని విమర్శించారు.
నీటి మట్టం తగ్గగానే సమస్యను గాలికి వదిలేస్తున్నారని, ఈ ధోరణి వల్ల ముంపు సమస్యకు ఎప్పటికీ పరిష్కారం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం బాధ్యతలను నెట్టేసుకునే రాజకీయాలను పక్కనబెట్టి, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పోలవరం బ్యాక్‌వాటర్ తీవ్రతపై నిపుణుల బృందంతో వెంటనే సమగ్ర అధ్యయనం జరిపించాలని పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay) డిమాండ్ చేశారు.
భద్రాచలం ప్రాంతానికి రక్షణగా బలమైన కరకట్టల నిర్మాణం, శాశ్వత నివారణ చర్యలతో కూడిన మాస్టర్ ప్లాన్ రూపొందించి తక్షణమే అమలు చేయాలని కోరారు.తాను మంత్రిగా ఉన్న సమయం నుంచే బిఆర్‌ఎస్ పార్టీ తరఫున పోలవరం బ్యాక్‌వాటర్ ముప్పుపై, తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణపై అనేక వేదికలపై నిరంతరం గళం వినిపించానని గుర్తుచేశారు. భద్రాచలం ప్రజల రక్షణ, భద్రత విషయంలో బిఆర్‌ఎస్ ఎప్పటికీ రాజీపడదని, శాశ్వత పరిష్కారం సిద్ధించే వరకు బాధితుల పక్షాన నిలబడి పోరాడుతుందని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
Also Read : హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Follow Us On : WhatsApp

