ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిరసన తెలపడం నేరమా?: భండారి శాంతికుమార్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన నిరసన సందర్భంగా విద్యార్థులు, యువమోర్చా నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భండారి శాంతికుమార్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిరసన తెలపడం నేరమా? అని నిలదీశారు.

తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం గొంతెత్తిన విద్యార్థులు, యువతకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం వారిపై లాఠీలు ప్రయోగించడం అత్యంత దురదృష్టకరమని భండారి శాంతికుమార్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో విద్యార్థులు, బీజేవైఎం కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లాఠీలతో యువత గొంతును అణచివేయలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించే వారిపై పోలీసు బలాన్ని ప్రయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని శాంతికుమార్ మండిపడ్డారు. యువత అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి తప్ప, పోలీసు బలంతో వారి గొంతును అణచివేయాలని చూడకూడదన్నారు. అధికారం శాశ్వతం కాదన్న ఆయన.. లాఠీ దెబ్బలతో ప్రజల ప్రశ్నలను ఆపలేరని, ఒక్కో లాఠీ దెబ్బ యువతలోని పోరాట స్ఫూర్తిని మరింత బలపరుస్తుందని చెప్పారు.

విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా, వారి సమస్యలపై ప్రశ్నించిన వారిని అణచివేసే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ”విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం ఒకవైపు… వాటిని ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన యువతపై లాఠీలు ప్రయోగించడం మరోవైపు. ఇదేనా కాంగ్రెస్ చెప్పే ప్రజాపాలన?” అని ప్రశ్నించారు. లాఠీచార్జ్ ఘటనపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శాంతికుమార్ డిమాండ్ చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>