కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించే లక్ష్యంతో తక్కువ ధరలకు బియ్యం (Subsidised Rice) విక్రయాలకు ఆదివారం నుంచి శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమం ఈరోజు (శనివారం) ప్రారంభించాల్సి ఉండగా, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఒక రోజు వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 130 రైతు బజార్లతో పాటు 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహించనున్నారు. విజయవాడ పటమట రైతు బజారులో మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. కాగా, ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.62 పలుకుతున్న బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని రూ.52కే, అలాగే రూ.58 విలువైన గ్రేడ్-1 రా రైస్‌ను రూ.50కే ప్రజలకు అందించనున్నారు.
అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితుల కారణంగా అత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం (Subsidised Rice) అందుబాటులోకి రావడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలగనుందని అధికారులు వెల్లడించారు.
Also Read : ఒకే కుటుంబం పేర్ల సంప్రదాయానికి స్వస్తి : ప్రధాని మోదీ
Follow Us On: Instagram

