కలం, వెబ్ డెస్క్ : విజయనగరం జిల్లా భోగాపురం(Bhogapuram)లో నిర్మించిన నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం కేవలం ఒక మౌలిక వసతి ప్రాజెక్ట్ మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఒక సరికొత్త రన్‌వే అని అభివర్ణించారు.
ఈ విమానాశ్రయం ఇక్కడి యువత ఉజ్వల భవిష్యత్తుకు లాంచ్‌ప్యాడ్‌లా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారకార్థం, ఈ నూతన విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని ప్రకటించారు. గతంలో విమానాశ్రయాలకు కేవలం ఒకే కుటుంబం పేరు పెట్టే సాంప్రదాయం ఉండేదని, తాము ఆ పద్ధతిని మార్చి అయోధ్య విమానాశ్రయానికి వాల్మీకి మహర్షి పేరు, పంజాబ్‌లో సంత్ రవిదాస్ పేరు పెట్టిన విషయాన్ని మోదీ (PM Modi) గుర్తుచేశారు.
గడిచిన పన్నెండేళ్లలో దేశీయ విమానయాన రంగం అసాధారణమైన పురోగతిని సాధించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2014 వరకు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే అందుబాటులో ఉండగా, నేడు ఆ సంఖ్య 166కు చేరిందని వివరించారు. ఒకప్పుడు విమాన ప్రయాణం కేవలం మెట్రో నగరాలకే పరిమితమయ్యేదని, కానీ ఎన్డీయే ప్రభుత్వ హయాంలో సాధారణ ప్రజలు సైతం విమానాల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఉడాన్’ (UDAN) పథకం వల్ల పేద కుటుంబాల ప్రజలకు కూడా విమానం ఎక్కే అవకాశం లభించిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయాల సంఖ్య పెరగడమే కాకుండా, ఇటీవల ఉడాన్ పథకం రెండో దశను కూడా ప్రారంభించామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 29 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు.
Also Read : ఇదే ఉత్తరాంధ్ర దెబ్బ.. జగన్‌కు లోకేశ్ కౌంటర్!
Follow Us On: Sharechat

