పగటిపూట చోరీ.. రూ.15 లక్షల సొత్తు రికవరీ

కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో (Pillutla) ఇటీవల జరిగిన పగటిపూట ఇంటి చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 15 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ఒక స్మార్ట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 29న పిల్లుట్ల గ్రామానికి చెందిన బబ్బురి శ్రీశైలం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువాలను పగులగొట్టి సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు, 99 తులాల వెండి వస్తువులు, కొంత నగదును దొంగిలించి పరారయ్యాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు శివంపేట ఎస్‌ఐ మధుకర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టిన పోలీసులు.. పిల్లుట్ల గ్రామానికి చెందిన బబ్బురి గోపాల్ (30)ను అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో గోపాల్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మద్యం, జల్సాలకు అలవాటుపడి డబ్బుల అవసరం కారణంగా సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో చోరీకి పాల్పడినట్లు వెల్లడించాడు. నిందితుడి వద్ద నుంచి 96.35 గ్రాముల బంగారు ఆభరణాలు, 721 గ్రాముల వెండి వస్తువులు, రూ.2,500 నగదు, ఒక స్మార్ట్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>