కలం, స్పోర్ట్స్ : ప్రపంచ ఫుట్‌బాల్‌ను కుదిపేస్తున్న ఫిఫా(FIFA) కమర్షియల్ హక్కుల విక్రయ ప్రతిపాదనపై(Commercial Rights Plan) వివాదం మరింత ముదిరింది. ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ప్రతిపాదించిన కొత్త ప్రణాళికను ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (AFC) తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన యూఈఎఫ్ఏ, కాంకాకాఫ్ సమాఖ్యలకు ఏఎఫ్సీ బహిరంగ మద్దతు ప్రకటించింది. దీంతో ఫిఫాలోని 211 సభ్య దేశాలలో సగానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు ప్రధాన సమాఖ్యలు ఒకే అభిప్రాయంతో నిలిచాయి.
వివాదానికి కారణమైన ‘ఫిఫా ఫార్వర్డ్ ఎంటర్ప్రైజ్’ అనే కొత్త సంస్థ ద్వారా పురుషుల, మహిళల వరల్డ్‌కప్‌లు, క్లబ్ వరల్డ్‌కప్‌ల ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ల విక్రయాలను నిర్వహించాలని ఫిఫా ప్రతిపాదించింది. సుమారు 20 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థలో 20 శాతం వాటాను ప్రైవేట్ పెట్టుబడిదారులకు విక్రయించాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఏఎఫ్సీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అన్ని సభ్య దేశాల ఆమోదం లేకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఫిఫా పాలనా విధానాలను సమీక్షించి, నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేసింది.ఇప్పటికే యూఈఎఫ్ఏ ఈ ప్రతిపాదనలో మార్పులు చేయకపోతే ఫిఫా టోర్నీలను బహిష్కరిస్తామని హెచ్చరించగా, కాంకాకాఫ్ కూడా అధికారికంగా వ్యతిరేకించింది.
అయితే ఫిఫా మాత్రం మీడియాలో వస్తున్న కథనాలు తమ ఉద్దేశాన్ని తప్పుగా ప్రతిబింబిస్తున్నాయని తెలిపింది. ఫుట్‌బాల్‌ను అమ్మడం లేదని, టోర్నీలు, నిబంధనలపై పూర్తి నియంత్రణ తమ వద్దే కొనసాగుతుందని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 19లోపు అన్ని సభ్య దేశాల అభిప్రాయాలు సేకరిస్తామని వెల్లడించింది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందాలంటే ఫిఫా సభ్య దేశాలలో కనీసం 106 దేశాల మద్దతు అవసరం. ప్రస్తుతం మూడు పెద్ద సమాఖ్యలు వ్యతిరేకంగా నిలవడంతో ఈ ప్రతిపాదన భవితవ్యంపై ఆసక్తి నెలకొంది.

