ఏన్కూరులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు

కలం, ఖమ్మం బ్యూరో : సొంత బాబాయిపై ఉన్న ఆస్తి కక్షలతో ఒక వ్యక్తి ఏకంగా అత్యంత ప్రమాదకరమైన అంతర్రాష్ట్ర దొంగల ముఠాతో చేతులు కలిపిన ఘటన ఖమ్మం జిల్లా ఏన్కూరు (Enkuru) లో వెలుగుచూసింది. జైలులో ఏర్పడిన పరిచయాలతో అంతర్రాష్ట్ర గ్యాంగ్‌ను రంగంలోకి దించి, సొంత ఊరిలోనే దొంగతనాలకు పథకం పన్నిన ముఠా గుట్టును ఏన్కూరు పోలీసులు సమర్థవంతంగా రట్టు చేశారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులతో పాటు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.

​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏన్కూరుకు చెందిన గాదె నాగరాజుకు తన బాబాయి గాదె రామారావుతో కొంతకాలంగా ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. రామారావు ఇంట్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు ఉన్నాయని భావించిన నాగరాజు, ఎలాగైనా వాటిని దోచుకోవాలనే దుర్బుద్ధితో కుట్రపన్నాడు. ఈ క్రమంలో గతంలో హుజూర్‌నగర్ సబ్‌జైలులో ఉన్న సమయంలో తనకు పరిచయమైన అంతర్రాష్ట్ర నేరస్థులు జల్లేపల్లి వెంకటేశ్వరరావు, చల్ల సురేష్, ఖాజా నాగ వీర భాస్కరరావులను నాగరాజు సంప్రదించాడు. బాబాయి ఇంట్లో భారీగా సొత్తు లభిస్తుందని ఆశచూపి వారిని ఏన్కూరుకు ఆహ్వానించాడు.

​నాగరాజు పథకం ప్రకారం గుంటూరు నుంచి వచ్చిన ఈ ముఠా రామారావు ఇంటిని లక్ష్యంగా చేసుకుంది. అయితే, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ఖాళీ చేతులతో వెళ్లలేక, సమీపంలో తాళం వేసి ఉన్న అన్నదేవర రాధమ్మ ఇంట్లోకి జొరబడి లక్షా పదివేల రూపాయల నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఆ తర్వాత కూడా తమ అసలు లక్ష్యాన్ని వదలకుండా నిందితులు పలుమార్లు ఏన్కూరు వచ్చి రామారావు ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు.

నిందితుడిపై 23కు పైగా కేసులు

ప్రతిసారీ స్థానికుల రాకపోకలు ఎక్కువగా ఉండటంతో బాబాయి ఇల్లు దోచుకోవాలనే ప్లాన్ ఫెయిల్ అయింది. ఈ క్రమంలోనే తిరుగు ప్రయాణాల్లో తల్లాడ మండలం అన్నారుగూడెంతో పాటు పలు మార్గమధ్య ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని గృహచోరీలకు పాల్పడ్డారు.
​దర్యాప్తులో ఈ ముఠాకు చెందిన నేరస్థుల తీవ్ర నేరచరిత్ర వెలుగు చూసింది. ముఠాలో కీలక సభ్యుడైన చల్ల సురేష్‌పై తెలుగు రాష్ట్రాల్లో 35కి పైగా గృహచోరీ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఇతను రాజమండ్రి సెంట్రల్ జైలులో పీడీ చట్టం కింద నిర్బంధంలో ఉన్నాడు. మరొక నిందితుడు జల్లేపల్లి వెంకటేశ్వరరావుపై 23కు పైగా కేసులు ఉండటంతో పాటు గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్‌లో రౌడీషీట్ కూడా నమోదైంది.

వీరు అంతర్రాష్ట్ర స్థాయిలో వ్యవస్థీకృత నేర ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతుండటంతో బిఎన్‌ఎస్ సెక్షన్ 111 కింద కేసు తీవ్రతను పెంచినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ​ప్రస్తుతం జల్లేపల్లి వెంకటేశ్వరరావు, గాదె నాగరాజులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన హెడ్ కానిస్టేబుల్ నాగేంద్రబాబు, కానిస్టేబుళ్లు రవి, శంకర్, వినయ్‌లను ఎస్‌హెచ్ఓ ఎన్.సంధ్య అభినందించారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఎస్‌హెచ్ ఓ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>