వ‌ర్షాల‌పై ముందస్తు చర్యలు చేపట్టాలి: సుదర్శన్ రెడ్డి

క‌లం, నిర్మ‌ల్‌: భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రాజెక్టుల పరిస్థితి, పంటల సాగు, ఎల్‌ నినో ప్రభావం తదితర అంశాలపై నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం సాయంత్రం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో భారీ వర్షాల వలన ప్రాజెక్టుల నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో పరిస్థితులు, దెబ్బతిన్న రహదారుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. రహదారులు, వంతెనలు దెబ్బతిన్నట్లయితే వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టులకు వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలని తెలిపారు. ఎల్‌ నినో ప్రభావం వల్ల రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులకు పంట మార్పిడి విధానాలపై వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. అధిక నీటి అవసరమున్న వరి పంటకు బదులుగా ఆయిల్‌ పామ్, కంది, నువ్వులు, పత్తి తదితర ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని తెలిపారు.

కొత్త పంటల సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొంటూ రైతులు పంటల సాగులో సమతుల్యత పాటించాలని సూచించారు. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్ లు భవేశ్ మిశ్రా, రాజర్షి షా, నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల, నిర్మల్, ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, ఎస్. రాజేశ్వర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేష్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>