కలం, మెదక్ బ్యూరో: జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో హైవే వెంబడి ఉన్న ఢాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యం కీలక పాత్ర పోషించాలని మెదక్ జిల్లా ఎస్పీ (Medak SP) డి.వి. శ్రీనివాసరావు (Srinivasa Rao) అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 100, 112 లేదా 108 కు సమాచారం అందించి, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించేందుకు చొరవ చూపాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో హైవేల వెంట ఉన్న ఢాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యంతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట (గోల్డెన్ అవర్)లో అందించే వైద్య సహాయం ప్రాణాలను కాపాడడంలో అత్యంత కీలకమని పేర్కొన్నారు.
హోటల్ సిబ్బందికి ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్), సీపీఆర్ (CPR)పై ప్రత్యేక శిక్షణ అందించి, అత్యవసర పరిస్థితులలో వేగంగా స్పందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైవే వెంబడి ఉన్న ప్రతి హోటల్, ఢాబాలో వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలం ఉండేలా చూడాలని ఎస్పీ సూచించారు. పార్కింగ్ సౌకర్యం లేక జాతీయ రహదారులపై భారీ వాహనాలు నిలిపివేయడం ప్రమాదాలకు దారితీస్తోందని అన్నారు. వాహనాలను క్రమబద్ధంగా పార్కింగ్ చేయించేందుకు ప్రతి హోటల్లో ప్రత్యేకంగా ఒక సిబ్బందిని నియమించాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలోని ప్రతి హోటల్, ఢాబాలో కనీసం నాలుగు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి నిరంతరం పనిచేసేలా చూడాలని యాజమాన్యాలను ఆదేశించారు. రహదారి భద్రత కోసం పోలీసులతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

