భద్రాచలంలో గోదావరి ఉధృతి…. డేంజర్ జోన్‌లో లోతట్టు ప్రాంతాలు..!

కలం, ఖమ్మం బ్యూరో : ​ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నిమిష నిమిషానికీ ప్రవాహం పెరిగి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదిలో ప్రస్తుతం 11,44,645 క్యూసెక్కుల వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో, లోతట్టు ప్రాంతాలన్నీ ఒక్కసారిగా డేంజర్ జోన్‌లోకి వెళ్లాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతుండటంతో, ప్రమాదాన్ని ముందే పసిగట్టిన జిల్లా యంత్రాంగం అత్యంత వేగంగా రంగంలోకి దిగింది.

​పరిస్థితి తీవ్రతను స్వయంగా సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలసి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. భద్రాచలం కరకట్టపై నిలబడి పొంగిపొర్లుతున్న గోదావరి ఉధృతిని, స్నానఘాట్ల వద్ద పరిస్థితిని తనిఖీ చేశారు. విస్తా కాంప్లెక్స్ స్లూయిస్ వద్ద వరద నీటిని బయటకు పంపే మోటార్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాంకేతిక లోపాలు రాకుండా చూస్తూ నీటి ఎత్తిపోతను నిరంతరం కొనసాగించాలని ఇరిగేషన్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

​మరోవైపు కూనవరం, భద్రాచలం ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరుతుండటంతో, రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని వెల్లడించిన కలెక్టర్, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆలస్యం చేయకుండా వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉచిత ఆహారం, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలతో పాటు మహిళలు, చిన్నారులు, వృద్ధులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు సిద్ధం చేశారు.

​ఏ క్షణంలోనైనా తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు NDRF, SDRF, DRF విపత్తు నిర్వహణ బృందాలు ఇప్పటికే భద్రాచలంలో మోహరించాయి. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య శాఖలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు అత్యవసర సహాయం అందించడానికి 08744-241950 ఫోన్ నంబర్, 9392919743 వాట్సాప్ నంబర్‌లతో 24 గంటలూ పనిచేసే ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను అందుబాటులో ఉంచారు.

​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. గోదావరి తీరప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిలోకి దిగవద్దని హెచ్చరించారు. సరదా కోసం సెల్ఫీలు, వీడియోలు దిగుతూ ప్రాణాలమీదకి తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసరంలో ఉన్నవారు 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకుండా, కేవలం అధికారిక హెచ్చరికలను మాత్రమే పాటించాలని, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న రక్షణ చర్యలకు ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని అధికారులు కోరారు.

Also Read : క్షుద్రపూజలు చేశారు.. హరీశ్ రావుపై అద్దంకి కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>