కలం, వరంగల్ బ్యూరో : తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అంతిమయాత్రలో హృదయవిదారక దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ‘మల్లెప్పుడొస్తావ్ పెద్దన్న, మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్లిపోయావా? మాకు ఇక దిక్కెవరు..?’ అంటూ కార్యకర్తలు, అభిమానులు బోరున విలపిస్తున్నారు.
చివరిసారిగా తమ అభిమాన నాయకుడిని చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో నర్సంపేట జనసంద్రంగా మారింది. మహిళలు, వృద్ధులు, యువకులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలవర్షం కురిపిస్తూ కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ‘జై తెలంగాణ, పెద్ది అమర్ రహే, పెద్దన్నా.. నువ్వు మా గుండెల్లో చిరస్థాయిగా ఉంటావు..’ అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు నర్సంపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

