కలం, వెబ్ డెస్క్ : గురుకుల పాఠశాలల బంకర్ బెడ్ల కొనుగోళ్ల టెండర్లలో జరిగిన వందల కోట్ల రూపాయల అవినీతి, అవకతవకలపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సాగించిన న్యాయపోరాటం కీలక మలుపు తిరిగింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన బంకర్ బెడ్ల కొనుగోళ్లలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కేటాయించారని, భారీగా ప్రజాధనం దుర్వినియోగం అయిందని పెద్ది సుదర్శన్ రెడ్డి న్యాయపోరాటానికి దిగారు.
అధికార పక్షం నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చినా వెనకడుగు వేయకుండా ఆయన ఈ కేసును సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లారు. కేసులోని అవినీతి ఆరోపణలలో ప్రాథమిక ఆధారాలను గుర్తించిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపడం రాజకీయ, న్యాయ వర్గాల్లో సంచలనంగా మారింది.
తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సమయంలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడి ఈ అవినీతిపై గళమెత్తడం గమనార్హం. తెలంగాణ ఉద్యమ యోధుడిగా, ప్రజా నాయకుడిగా తన జీవితాంతం పోరాడిన ఆయన, తుది శ్వాస విడిచే ముందు కూడా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై రాజీలేని పోరాటం సాగించారు. నిష్క్రమిస్తూ కూడా ఆయన అవినీతిపై చేసిన ఈ పోరాటం ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన మార్గదర్శకంగా నిలుస్తుందని బీఆర్ఎస్ నేత ప్రొఫెసర్ శ్రావణ్ కుమార్ కొనియాడారు. ప్రజా సేవకే అంకితమైన పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

