కలం, హనుమకొండ: గ్రేటర్ వరంగల్ (Warangal) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆసుపత్రులు, ప్రైవేట్ పాఠశాలలు, వాణిజ్య సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా అమలుచేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ లింగంతో కలిసి కమిషనర్ నగరంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులు, పాఠశాలలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కాజీపేటలోని డి-మార్ట్, రోహిణి ఆసుపత్రితోపాటు హనుమకొండ, వరంగల్ నగరాల్లోని పలు ఆసుపత్రులు, ప్రైవేట్ విద్యాసంస్థలు, వాణిజ్య భవనాల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫైర్ అలారం వ్యవస్థలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, ఇతర అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి భవన యాజమాన్యం ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను తనిఖీ చేయించి, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్‌ను పునరుద్ధరించుకోవాలని సూచించారు. గడువు ముగిసిన అనుమతులతో కార్యకలాపాలు నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. అలాంటి సంస్థలపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నగరంలో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేయని లేదా భద్రతా ప్రమాణాలు పాటించని భవనాలను గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో అగ్నిమాపక భద్రత కీలకమన్నారు. అన్ని సంస్థలు నిబంధనలను పూర్తిగా అమలు చేసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్ వెంకన్న సూచించారు. తనిఖీల్లో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ లింగం, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజేశ్వరరావు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది, జీడబ్ల్యూఎంసీ అధికారులు పాల్గొన్నారు.

