HIV కలకలం.. యువతకు విస్తృతంగా టెస్టులు

కలం, వెబ్ డెస్క్: దేశంలో అత్యధిక హెచ్‌ఐవి (HIV) ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో సుమారు 2.60 లక్షల మంది హెచ్‌ఐవితో జీవిస్తుండగా.. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (NACO) 2024 నివేదిక ప్రకారం కేవలం 2.05 లక్షల మంది మాత్రమే ‘యాంటీరెట్రోవైరల్ థెరపీ’ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో భయం లేకుండా ప్రజలు ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ఆరోగ్య అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ‘మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష’ క్యాంపెయిన్‌లో భాగంగా విద్యార్థుల కోసం క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చారు. హెచ్‌ఐవీ సోకినప్పటికీ ఏళ్ల తరబడి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని, అందుకే అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

సోకిన వ్యక్తుల అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషితమైన సిరింజ్‌లను వాడటం, సోకిన రక్తం ఎక్కించడం లేదా గర్భధారణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తల్లి నుండి బిడ్డకు హెచ్‌ఐవి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కౌగిలించుకోవడం, కరచాలనం చేయడం, ఆహారాన్ని పంచుకోవడం వంటి సాధారణ స్పర్శల ద్వారా ఈ వ్యాధి రాదని తెలిపారు. తొలి దశలోనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా సరైన సమయంలో చికిత్స ప్రారంభించి, వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఆధునిక చికిత్సల ద్వారా బాధితులు ఎక్కువ కాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా హెచ్‌ఐవి నియంత్రణకు అవగాహనతో పాటు ముందస్తు పరీక్షలే కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>