ఓటమిని గెలిచిన నేత.. పెద్ది సుదర్శన్ రెడ్డి!

కలం, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) కన్నుమూశారు. సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన, ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణ వార్తతో నర్సంపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.

ఉద్యమ ప్రస్థానం..

సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించిన నాయకుడు. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన నాటి నుండి, వరంగల్ జిల్లాలో పార్టీ నిర్మాణంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, ఉద్యమకారుడిగా తనదైన ముద్ర వేశారు. ఉద్యమ కాలంలో పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకుని నడిపిస్తూ ప్రజా హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్నారు.

రాజకీయ ఒడిదొడుకులు – తొలి పదవి..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా నర్సంపేట నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దొంతి మాధవరెడ్డి చేతిలో ఓటమి ఎదురైనప్పటికీ, ప్రజాసేవలో ఆయన వెనకడుగు వేయలేదు. ఉద్యమంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. ఆ బాధ్యతల్లో ఉంటూనే 2014 నుండి 2018 వరకు నర్సంపేట నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ఉద్యమ కార్యకర్తలను సమన్వయం చేయడానికి నిరంతరం కృషి చేశారు.

ఎమ్మెల్యేగా విజయం – నియోజకవర్గ ప్రగతి..

కఠోర శ్రమకు ఫలితంగా 2018 డిసెంబర్ 11న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) నర్సంపేట నియోజకవర్గం నుండి భారీ విజయం సాధించారు. డిసెంబర్ 12న శాసనసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, 2018 నుండి 2023 వరకు ఎమ్మెల్యేగా నర్సంపేట ముఖచిత్రాన్ని మార్చడానికి ఎంతో శ్రమించారు.

ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, సాగునీటి సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. రైతు, గ్రామీణాభివృద్ధి, సాగునీటి సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా నాయకుడిగా నిలిచారు. 2022 అక్టోబర్ 5న టీఆర్ఎస్ పార్టీ పేరు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారిన తర్వాత కూడా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తన సేవలను కొనసాగించారు.

రాజకీయాలకు అతీతంగా..

తన ఐదేళ్ల పదవీకాలంలో నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నడిపిన పెద్ది సుదర్శన్ రెడ్డి, 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి నర్సంపేట బరిలో నిలిచారు. డిసెంబర్ 3న వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో ఓటమి పాలవడంతో ఆయన ఎమ్మెల్యే పదవీకాలం ముగిసింది.

రాజకీయాలకు అతీతంగా అందరితో సత్సంబంధాలు కొనసాగించిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలకు తీరని లోటు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, కార్యకర్తలను సోంత తమ్ముళ్లలా ప్రోత్సహించే సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తిగా ఆయన అందరి మనసుల్లో నిలిచిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>