కలం, స్పోర్ట్స్ : కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలవలేదు.. పోటీలోనూ పాల్గొనలేదు. అయినా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తిగా సీజే మిల్లర్ (CJ Miller) నిలిచాడు. చేతిలో మాప్‌తో చేసిన డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. గ్లాస్గోలో జరుగుతున్న నెట్‌బాల్ మ్యాచ్‌ల మధ్య కోర్టును శుభ్రం చేసే బాధ్యత మిల్లర్‌ది. అయితే కేవలం మాప్‌తో కోర్టును శుభ్రం చేయడమే కాకుండా, ‘వార్మ్’, ‘స్ప్లిట్స్’ వంటి డ్యాన్స్ మూవ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. స్టేడియం మొత్తం చప్పట్లతో మార్మోగగా, డ్యాన్స్ ముగిసిన వెంటనే తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు.
మిల్లర్ ప్రదర్శనకు సంబంధించిన వీడియోలను కామన్వెల్త్ గేమ్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. లక్షలాది మంది వీక్షించగా, నెటిజన్లు ఆయనకు ‘మాప్ మ్యాన్’(Mop Man) అనే కొత్త పేరు పెట్టారు. అయితే మిల్లర్ కేవలం క్లీనర్ మాత్రమే కాదు. ఆయన ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్ కూడా. ‘ఫిఫ్త్ డైమెన్షన్ ఇనిషియేటివ్’ అనే సంస్థను స్థాపించి డ్యాన్స్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఎడిన్‌బర్గ్ ఫ్రింజ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్న ‘ఏ కోరస్ లైన్’నాటకానికి కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తూనే అందులో నటిస్తున్నారు.
ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిల్లర్.. తన పనిని పూర్తిగా ఆస్వాదిస్తూ చేశానని, ప్రేక్షకులను అలరించడం కూడా అందులో భాగమేనని చెప్పారు. వీడియోలు వైరల్ కావడం ఊహించలేదని, ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో నెటిజన్లు మిల్లర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఆయనకు ‘గోల్డ్ మెడల్ ఇవ్వాలి’ అని సరదాగా వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో అసలైన స్టార్ సీజే మిల్లరేనని అభిప్రాయపడుతున్నారు.

