స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి: SFI

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లోని ముకుంద్ లాల్ మిశ్రా భవన్‌లో భారత విద్యార్థి ఫెడరేషన్ (Karimnagar SFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు జూలై 29, 30 తేదీల్లో నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వాటి పరిష్కారంపై ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6న మహా ధర్నా నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఎలాంటి ఆంక్షలు లేకుండా అవసరమైన విద్యా సర్టిఫికెట్లు అందించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, డీబీటీ (DBT) విధానం ద్వారా స్కాలర్‌షిప్‌లు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి స్పష్టత లేదని అన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదేవిధంగా, రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాసంస్థలు అనేక సమస్యలతో సతమతమవుతున్నాయని, విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత సొంత భవనాలు నిర్మించాలని, గురుకులాల్లో నెలకొన్న అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన విద్యార్థులకు ఉదయం టిఫిన్ పథకం ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేసి విద్యార్థుల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 6న జరిగే మహా ధర్నాలో రాష్ట్రంలోని విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిక్, శ్రీకాంత్, మమత, సహాయ కార్యదర్శులు రాజు, భరత్, రమ్య, దీపిక, నాయకులు నరేష్, లెనిన్, అరవింద్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>