కలం, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) శ్రీకాకుళం జైలుకు చేరుకున్నారు. కొడుకు యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అప్పలరాజు (Seediri Appalaraju)ను కలిసేందుకు ఆయన జైలుకు వచ్చారు. అయితే సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌కు అధికారులు అనుమతించలేదు. జైలులో ములాఖత్‌లకు సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఉంటుంది. అయితే జగన్ పది నిమిషాలు ఆలస్యంగా 5 గంటల 10 నిమిషాలకు చేరుకున్నారు. దీంతో ఆయనను అధికారులు జైలు బయటే ఆపేశారు.
జగన్ జైలు బయట కొద్దిసేపు సీదిరి కుటుంబసభ్యులతో మాట్లాడారు. విశాఖ ఎయిర్ పోర్ట్, దారి పొడవునా అభిమానులు ఉండటం, అక్కడక్కడా ఆగుతూ నెమ్మదిగా రావడంతో జైలుకు చేరుకోవడం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ముందే పోలీసులు ములాఖత్ మినహా ర్యాలీలు, సభలు, అభిమానులను కలిసే కార్యక్రమాలు పెట్టుకోవద్దని ఆంక్షలు విధించారు. అయినప్పటికీ జైలు దగ్గరికి, దారి పొడవునా భారీగా జనం రావడంతో ములాఖత్‌కు ఆలస్యం అయ్యింది.

