పూరి గుడిసెలు లేని తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యం: పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో ఒక్క పేద కుటుంబం కూడా పూరి గుడిసెలో నివసించకూడదనే ధ్యేయంతో, ప్రతి అర్హులైన కుటుంబానికి శాశ్వత నివాసం కల్పించి పూరి గుడిసెలు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. పాలనను ప్రజా గుమ్మం వద్దకే తీసుకువెళ్లి, ఇంటింటికీ సంక్షేమ ఫలాలను అందించేందుకు ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు.

గురువారం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చండ్రుగొండ మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి, రూ.1.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండల పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుగా మంగయ్య బంజార గ్రామంలో రూ.45 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రావెల్ రోడ్డు, కల్వర్టు, సీసీ రోడ్డు, రిటైనింగ్ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆ గ్రామానికి అదనంగా మరో 24 ఇందిరమ్మ గృహాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పొకలగూడెం గ్రామంలో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టిన నాలుగు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామానికి ఇప్పటికే 77 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, రాబోయే రోజుల్లో మిగిలిన అంతర్గత రహదారులను కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తామని గ్రామీణులకు హామీ ఇచ్చారు. తదుపరి రావికంపాడు గ్రామంలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి (Minister Ponguleti) మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ. 8.21 లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టి వెళ్లిపోయినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏమాత్రం ఆపకుండా ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మహిళా సాధికారతకు, యువత ఉపాధికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు.

మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం స్వయం సహాయక సంఘాలకు రూ. 70 వేల కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేయడమే కాకుండా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డులతో పాటు నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ​ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: బొగ్గు మాఫియాపై ఈడీ పంజా.. 600 కోట్ల ఆస్తులు సీజ్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>