కలం, తుంగతుర్తి : కొందరు నాయకుల మాటలు నమ్మి కార్యకర్తలు ఎవరూ మోసపోవద్దని, నియోజకవర్గంలో ఎలాంటి పని జరగాలన్నా, పదవులు రావాలన్నా అది స్థానిక ఎమ్మెల్యే ద్వారానే సాధ్యమవుతుందని తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామేలు (Mandula Samuel) కుండబద్దలు కొట్టారు. మోత్కూరులో ఆయన బుధవారం కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంగా ఆయన పలు ఆసక్తికర, హాట్ కామెంట్స్ చేశారు.
‘పదవులు ఇప్పిస్తాం, మంత్రులతో మాట్లాడతాం అని చెప్పే కొందరు నేతల మాటలు నమ్మి మభ్యపడొద్దు. నియోజకవర్గ పరిధిలో ఏ అభివృద్ధి పని కావాలన్నా, ఎవరికి ఏ మంచి జరగాలన్నా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నా వల్లే అవుతుంది” అని సామేలు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచి తాను ప్రజల పక్షాన నిలబడ్డానని, తనను తాను మడమ తిప్పని పోరాట యోధుడిగా అభివర్ణించుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్న ప్రజా పాలనలో తాను భాగస్వామిగా ఉన్నానని తెలిపారు. నియోజకవర్గంలోని పేదలు, సామాన్య కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ భరోసాగా ఉంటానని.. సమస్యలు, ఇతర ఏ విషయాలైనా ఉంటే మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా వచ్చి తననే కలవాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. తాను కూడా సామాన్య కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వాడినేనని, అందరి ఇబ్బందులు తనకు తెలుసని ఆయన పేర్కొన్నారు.
మోత్కూరు మున్సిపల్ సమావేశంలో రసాభాస
మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ సాధారణ సమావేశం తీవ్ర ఉద్రిక్తత, రసాభాస మధ్య సాగింది. రూ. 15 కోట్ల మున్సిపల్ నిధుల వినియోగంపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ల మధ్య చోటుచేసుకున్న తీవ్ర వివాదం మున్సిపల్ రాజకీయాన్ని వేడెక్కించింది. ఈ వివాదం చివరకు స్థానిక తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ అనుకూల, ప్రతికూల వర్గాల పోరుగా మారడం గమనార్హం.
మున్సిపాలిటీకి మంజూరైన రూ. 15 కోట్ల అభివృద్ధి నిధుల ఖర్చు, వినియోగంపై సమావేశంలో చర్చ ప్రారంభమవ్వగానే కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ నిధులు ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు స్వీకరించడానికి ముందే మంజూరయ్యాయని, కాబట్టి వాటి వినియోగంపై ఇప్పుడు అనవసర జోక్యం తగదని ఎమ్మెల్యే మందుల సామ్యూల్ వర్గానికి చెందిన కౌన్సిలర్లు గట్టిగా వాదించారు.
ఎమ్మెల్యే వర్గం వాదనపై ప్రతికూల వర్గం కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల ఖర్చుపై కౌన్సిల్ జోక్యం అవసరం లేనప్పుడు.. ఆ నిధులకు సంబంధించి తీర్మానం పత్రాలపై తమ సంతకాలు ఎందుకు తీసుకుంటున్నారని నిలదీశారు. కౌన్సిల్ ఆమోదం లేకుండా నిధులు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. ఒకే పార్టీకి చెందిన కౌన్సిలర్లు నిధుల వినియోగంపై పరస్పర ఆరోపణలు, సవాళ్లతో విరుచుకుపడటంతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రూ. 15 కోట్ల భారీ నిధుల వ్యయంలో పారదర్శకత లోపించిందని ఒక వర్గం ఆరోపిస్తుండగా, అభివృద్ధిని అడ్డుకునేందుకే కావాలని రచ్చ చేస్తున్నారని మరొక వర్గం మండిపడింది. మొత్తానికి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ వర్గం, వ్యతిరేక వర్గాల మధ్య సాగిన ఈ వర్గపోరు మోత్కూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలను ఒక్కసారిగా బట్టబయలు చేసింది.

