కలం, జోగుళాంబ గద్వాల: ఓటరు జాబితా రూపకల్పనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్ అన్నారు. ఎస్ఐఆర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పై బుధవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ యాప్లో ప్రతి ఓటరు వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. యాప్లో నమోదు చేసిన వివరాలే ముసాయిదా ఓటరు జాబితా (డ్రాఫ్ట్ పబ్లికేషన్)లో ప్రతిబింబిస్తాయని, అందువల్ల చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రతి నమోదును పర్యవేక్షించి,తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి నమోదును సూపర్వైజర్లు క్షుణ్ణంగా తనిఖీ చేసి ధృవీకరించాలని సూచించారు. గైర్హాజరు, వలస వెళ్లి, మృతి చెందిన ఓటర్ల వివరాలకు సంబంధించి లిస్ట్ పై బీఎల్ఏల సంతకాలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణను కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు, ఓటర్ల సంఖ్య, భౌగోళిక పరిస్థితులు, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని చేపట్టాలని సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా ఎన్నికల నిర్వహణ కోసం మాత్రమే రూపొందించబడుతుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హతతో దీనికి ఎలాంటి సంబంధం లేదని ప్రజలకు స్పష్టంగా వివరించాలని అధికారులకు సూచించారు.
ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్ వీసీ అనంతరం వివిధ మండలాల తహసిల్దార్లు, ఇతర అధికారులతో మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, తప్పులు లేకుండా నాణ్యతతో చేపట్టాలన్నారు. జిల్లాలో డిజిటలైజేషన్ నిర్దేశిత గడువులోగా 100 శాతం పూర్తి చేయాలని, బిఎల్ఓ యాప్లో వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడంతో పాటు ప్రతి నమోదును క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా ధృవీకరించాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, ఎన్నికల విభాగం అధికారి మంజుల, వివిధ మండలాల తహసిల్దార్లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

