కలం, ఖమ్మం బ్యూరో: శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యక్షేత్రమైన భద్రాచలంలో(Bhadrachalam) ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం దేవస్థానం ఆధ్వర్యంలో ‘దమ్మక్క సేవా యాత్ర’ (Dammakka Seva Yatra) ను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఈసారి కూడా మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన భక్తులను ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయం నుంచి మంగళవాయిద్యాల నడుమ శోభాయాత్ర ప్రారంభమైంది. సబ్‌కలెక్టర్ కార్యాలయం సమీపంలోని దమ్మక్క విగ్రహం వద్దకు చేరుకున్న యాత్రికులు, భక్తులు దమ్మక్క విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పుష్పాంజలి ఘటించారు.
అనంతరం శోభాయాత్రగా మారుతీ సదనానికి చేరుకుని అక్కడ శ్రీ సీతారామచంద్రస్వామివారి దివ్య కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన భక్తులు స్వయంగా తీసుకొచ్చిన ప్రకృతిసిద్ధమైన ఫలాలు, పుష్పాలతో స్వామివారి కల్యాణం జరగడం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిరిజన భక్తుల కోసం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రసాద వితరణతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా గిరిజన భక్తులు దేవస్థానం ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు.

