కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు విఫలం: పువ్వాడ అజయ్

కలం, ఖమ్మం బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేసినా అవి విఫలమయ్యాయని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ఆరోపించారు. బీఆర్‌ఎస్ శ్రేణులు చేపట్టిన నిరంతర పోరాటం ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చి నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్‌ల మోటార్లను తిరిగి ప్రారంభించాల్సి వచ్చిందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కీలకమైన జల వనరుల ప్రాజెక్టు అని పువ్వాడ అజయ్ కుమార్ అభివర్ణించారు. భవిష్యత్తులో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన ఈ ప్రాజెక్టు కరువు, వర్షాభావ పరిస్థితుల్లో తాగునీరు, సాగునీటి భద్రతకు ఉపయోగపడుతోందని తెలిపారు.

అయితే రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్వహణను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో పార్టీ చేపట్టిన పోరాటం, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే పంప్ హౌస్‌లు తిరిగి ప్రారంభమయ్యాయని అజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు నీటి భద్రత కల్పించడంలో కాళేశ్వరం ప్రాజెక్టు పాత్ర కీలకమని పేర్కొన్న ఆయన, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును నిర్వీర్యం చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు. అన్ని పంప్ హౌస్‌లు, పంపింగ్ వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>