కలం, ఖమ్మం బ్యూరో: ప్రజాధనంతో చేపడుతున్న అభివృద్ధి పనులలో ఎలాంటి అలసత్వాన్ని సహించబోమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni) స్పష్టం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు పూర్తి పారదర్శకతతో పనిచేస్తూ నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో బుధవారం రూ.59 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీబీ నగర్ 14వ డివిజన్, పాత కొత్తగూడెం 12వ డివిజన్, 10వ డివిజన్ బూడిదగడ్డ, 58, 49 డివిజన్లలోని హనుమాన్ బస్తీలలో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం 24వ డివిజన్ బర్మా క్యాంపు ప్రాంతంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించనున్న కార్మిక సంక్షేమ భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి పారుదల, సీసీ రోడ్ల సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల నాణ్యతను స్థానిక ప్రజలు కూడా పరిశీలించి, అవసరమైన సూచనలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

