కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల పర్యవేక్షణ, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (Health Department) అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ బుధవారం వైద్యాధికారులతో జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లలో కుక్కకాటు నిరోధక (యాంటీ రేబీస్) మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రుల్లో ఈ మందుల నిల్వలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
కుక్కకాటు కేసుల పర్యవేక్షణ కోసం ప్రతి ఆసుపత్రిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని, సంబంధిత వివరాలను ప్రజలకు కనిపించే విధంగా నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించాలని తెలిపారు. వైద్యాధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లను ప్రతి రెండు వారాలకు ఒకసారి తనిఖీ చేసి విద్యార్థులకు వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. హాస్టల్ వంట సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని, గోళ్లు, జుట్టు క్రమంగా శుభ్రంగా ఉంచుకునేలా సూచించాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలలో ఆశా కార్యకర్తలు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి జ్వరం, విరేచనాలు, వాంతులు, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రతి మంగళ, శుక్రవారాలలో కార్యాచరణ ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని, వాటి నివేదికల ఆధారంగా వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్న గ్రామాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రోగ్రామ్ అధికారులు నిరంతరం ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేస్తూ టీకాల కార్యక్రమం, ఎన్‌సీడీ స్క్రీనింగ్, పీఎంఎస్‌ఎంఏ, ఆరోగ్య మహిళ, సికిల్ సెల్ స్క్రీనింగ్, టీబీ అనుమానితుల గుర్తింపు, మందుల పంపిణీ వంటి కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆరోగ్య సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణలో అప్రమత్తంగా పనిచేయాలని డాక్టర్ తుకారం రాథోడ్ సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేదా అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

