కలం, కరీంనగర్: తెలంగాణ రైతుల ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు (Velichala Rajender Rao) స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది-మేడారం, గాయత్రి పంప్‌హౌస్‌లను ప్రారంభించి రైతుల కోసం నీటిని ఎత్తిపోస్తుంటే, అది తమ వల్లేనని చెప్పుకోవడం బీఆర్ఎస్ నేతల దౌర్భాగ్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
నంది-మేడారం, గాయత్రి పంప్‌హౌస్‌లలోని బాహుబలి మోటార్లను ప్రారంభించి 6300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నామని రాజేందర్రావు చెప్పుకొచ్చారు. రైతుల పంటలు ఎండిపోకుండా, సాగునీటి అవసరాలు తీరేలా ప్రభుత్వం బాధ్యతాయుతంగా చర్యలు చేపడుతుంటే, దానిని తమ పోరాట ఫలితమని బీఆర్ఎస్ ప్రచారం చేయడం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ట అని విమర్శించారు.
పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ప్రచారానికే పరిమితమైన బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికీ క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించడం హాస్యాస్పదమన్నారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, తెలంగాణ ప్రజలు వాస్తవాలను గుర్తించే స్థితిలో ఉన్నారని చెప్పారు.
రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమైతే, ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం బీఆర్ఎస్ నైజంగా మారిందన్నారు.
ప్రజల మెప్పు కోసం ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా బీఆర్ఎస్ను మళ్లీ నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని, రైతుల సంక్షేమం, సాగునీటి నిర్వహణ, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన అజెండా అని రాజేందర్రావు వ్యాఖ్యానించారు.

