కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకొని అభివృద్ధిలోకి రావాలని మహబూబ్నగర్ (Mahabubnagar) అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ బుధవారం సి.సి కుంట మండలం ముచ్చింతల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గుంతల తవ్వకం, మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామంలో ఎస్ఐఆర్-2026 కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయడంలో విశేష కృషి చేసిన బూత్ లెవల్ అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించి సన్మానించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా ప్రగతి, అభ్యాస అనుభవాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించాలని, క్రమశిక్షణతో వ్యవహరించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు.

