కలం, స్పోర్ట్స్: చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం సొంత ఫోన్ కూడా లేదు. ఢిల్లీ వీధుల్లో మైళ్ల కొద్దీ నడక. బస్సుల్లో రోజూ నరకం. 2002లో కేవలం రూ. 100 జీతంతో ప్రయాణం మొదలైంది. పాతికేళ్ల తర్వాత అదే వ్యక్తి ప్రపంచాన్ని చుట్టేశాడు. టీమిండియా స్టార్ క్రికెటర్లకు అత్యంత నమ్మకమైన సపోర్ట్ స్టాఫ్‌గా మారాడు. అతడే మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar). జోధ్‌పూర్ యూనివర్సిటీలో థెరపీ డిప్లొమా పూర్తయ్యాక రాజీవ్ ఢిల్లీకి వచ్చాడు. ఐదేళ్ల పాటు తిండికి, స్థిరమైన పనికి తీవ్రంగా కష్టపడ్డాడు. ఆ సమయంలో ఒకరు కొనిచ్చిన నోకియా 1100 ఫోనే అతనికి ఆధారమైంది.
2004లో రాజీవ్ (Rajiv Kumar) జీవితం మలుపు తిరిగింది. డాక్టర్ చౌదరి ద్వారా పేసర్ ఆశిష్ నెహ్రా పరిచయమయ్యాడు. నెహ్రా గాయాల నుంచి కోలుకోవడానికి రాజీవ్ ఎంతో శ్రమించాడు. నెహ్రా ప్రోత్సాహంతోనే రాజీవ్‌కు DDCAలో అవకాశం వచ్చింది. పదేళ్ల పాటు ఢిల్లీ రంజీ టీమ్‌తో పనిచేశాడు. 2008లో ఐపీఎల్ రావడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లో చేరాడు. ఆ తర్వాత ISL, ప్రో కబడ్డీ, హాకీలోనూ సేవలందించాడు. నెహ్రా దయ వల్ల రాజీవ్‌కు 2015లో ఎంఎస్ ధోనీతో పరిచయం ఏర్పడింది. 2016 టీ20 వరల్డ్ కప్‌తో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి అడుగుపెట్టాడు. తొలిరోజే ధోనీ అతన్ని డిన్నర్‌కు తీసుకెళ్లి ధైర్యాన్నిచ్చాడు.
ఆ తర్వాత ఎనిమిదేళ్ల పాటు నలుగురు భారత కెప్టెన్లతో కలిసి పనిచేశాడు. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ పిచ్చి, రోహిత్ శర్మ ప్రేమగల మనసు, శుభ్‌మన్ గిల్ నాయకత్వ లక్షణాలు అతన్ని బాగా ఆకట్టుకున్నాయి. కోవిడ్ టైమ్‌లో రాజీవ్ కొడుకు అనారోగ్యానికి గురైతే, టీమిండియా ఆటగాళ్లంతా కొండంత అండగా నిలిచారు. కెరీర్‌లో ఎన్నో హెచ్చుతగ్గులు చూశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో శ్మశాన నిశ్శబ్దాన్ని చూశాడు. కానీ, 2024 టీ20 వరల్డ్ కప్ గెలుపుతో అతని ఏళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది.
మసాజ్ టేబుల్ వద్ద కుల్దీప్, సిరాజ్, షమీలతో అల్లరి చేసేవాడు. రిషబ్ పంత్ యాక్సిడెంట్ అయినప్పుడు కన్నీళ్లతో దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఈ రోజు రాజీవ్ సాధించిన విజయం కేవలం అతనిది మాత్రమే కాదు. అతని స్ఫూర్తితో గ్రామం నుంచి దాదాపు 50 మంది యువకులు ఈ రంగంలోకి వచ్చి స్థిరపడ్డారు. 2025 ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత టీమిండియాకు గుడ్ బై చెప్పిన రాజీవ్, ప్రస్తుతం సదరన్ బ్రేవ్ టీమ్‌తో పనిచేస్తున్నాడు.
Read Also: కామన్వెల్త్ గేమ్స్: సాజన్ ప్రకాశ్ అవుట్!
Follow Us On : WhatsApp

