కలం, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోత వర్షాలు (Adilabad Rainfall) కురుస్తున్నాయి. నిర్మల్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బుధవారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా, పలుచోట్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు జిల్లాలోని జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.
రహదారులు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పీచర ధర్మారం వద్ద వరద ఉద్ధృతికి రహదారి కొట్టుకుపోయింది. దీంతో పీచర ధర్మారం–సోన్ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నర్సాపూర్ (జీ) గ్రామంలో వాగు ఉప్పొంగడంతో గ్రామం నుంచి పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి వాగును దాటి పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్లుగా వంతెన నిర్మించాలని కోరుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు.
లింగాపూర్ మండలం పిట్టగూడ వద్ద బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో సిర్పూర్ (యూ), లింగాపూర్ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు వరద తగ్గే వరకు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. తిర్యాని మండలంలోని భీంపూర్–అస్నూర్ వాగు ఉప్పొంగడంతో భీంపూర్, అస్నూర్, మంగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల గ్రామంలోని మైసమ్మ చెరువు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వరద నీరు సమీప పంట పొలాల్లోకి చేరి చెరువులను తలపించేలా మారింది. మండలంలోని పలు వాగులు ఉప్పొంగడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కడేం ప్రాజెక్టుకు జలకళ
భారీ వర్షాల కారణంగా కడేం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. నిన్నటి వరకు ఇసుక దిబ్బలతో కనిపించిన ప్రాజెక్టు ప్రస్తుతం వరద నీటితో నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి సుమారు 22,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఒక్కరోజులోనే ప్రాజెక్టు నీటి నిల్వ 0.823 టీఎంసీల నుంచి 1.30 టీఎంసీలకు పెరిగింది. ఇదే స్థాయిలో వరద కొనసాగితే రాత్రి నాటికి నీటి నిల్వలు 2 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులోకి నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, ఈ వర్షాలు కరువు పరిస్థితులను దూరం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పరవళ్లు తొక్కిన జలపాతాలు
భారీ వర్షాలతో జిల్లాలోని జలపాతాలు సైతం ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తిర్యాని మండలం గుండాలలోని బాహుబలి జలపాతం ఉగ్రరూపం దాల్చి ఎత్తైన కొండలపై నుంచి ఉరకలెత్తుతూ కనువిందు చేసింది. ఈ దృశ్యాలు బాహుబలి సినిమాలోని జలపాతాన్ని తలపిస్తున్నాయని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు.
అదేవిధంగా కొద్ది రోజుల క్రితం నీటి లేమితో వెలవెలబోయిన కుంటాల జలపాతం ప్రస్తుతం భారీ నీటి ప్రవాహంతో పరవళ్లు తొక్కుతోంది. జలపాతం నుంచి వినిపిస్తున్న గర్జనలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రవాహం అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో జలపాతం వద్దకు సందర్శకులను అటవీ శాఖ అధికారులు అనుమతించడం లేదు.
జిల్లాలో నమోదైన వర్షపాతం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని – 108.2 మి.మీ, లింగాపూర్ – 93.4 మి.మీ, సిర్పూర్ (యూ) – 58.6 మి.మీ, జైనూర్ – 56.2 మి.మీ, నిర్మల్ జిల్లాలో నిర్మల్ అర్బన్ – 132.3 మి.మీ, కడేం (పెద్దూర్) – 131.2 మి.మీ, సోన్ – 130.0 మి.మీ, మామడ – 115.8 మి.మీ, నిర్మల్ రూరల్ – 110.6 మి.మీ, ఖానాపూర్ – 108.0 మి.మీ.
అధికారులు అప్రమత్తం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాగులు, వంకల సమీపంలో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.
Read Also: తెలంగాణ సాగునీటి రంగానికి ఊరట.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Follow Us On : WhatsApp

