కలం, నిర్మల్ : సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు (Swarna Project) లో జౌలీ కాల్వకు నీటిని విడుదల చేసే గేటు మొరాయించడంతో విలువైన నీరు వృథాగా పారుతోంది. రైతుల సాగు అవసరాల దృష్ట్యా అధికారులు కాల్వకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు ప్రాజెక్టులోకి చేరడంతో గేటును కిందికి దించే ప్రయత్నంలో అది మొరాయించింది. గేటు పనిచేయకపోవడంతో నీటి ప్రవాహాన్ని నిలిపివేయడం సాధ్యంకాక, నీరు నిరంతరం వృథాగా దిగువకు వెళ్తోంది.
దీంతో నీటిపారుదల శాఖ అధికారులు తాత్కాలికంగా ప్రాజెక్టు (Swarna Project) గేటును తాళ్లతో బిగించి, సిమెంట్ బస్తాలు, గడ్డిని ఉపయోగించి నీటి ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఏడాది గేట్ల మరమ్మతుల పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, వర్షాకాలం రాగానే గేట్లు మొరాయించడం పరిపాటిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చేపట్టకుండా తాత్కాలిక మరమ్మతులతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శిస్తున్నారు. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి గేటును పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని రైతులు నీటిపారుదల శాఖ అధికారులను కోరుతున్నారు.
Read Also: తెలంగాణ ‘సెట్’కు దరఖాస్తులు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
Follow Us On : WhatsApp

