కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) నగరంలోని ప్రకాశ్‌నగర్ వద్ద మున్నేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ప్రజా ప్రయోజనాలను విస్మరించిన విధ్వంసకర పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. బుధవారం చెక్‌డ్యామ్ కూల్చివేసిన ప్రాంతాన్ని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సందర్శించి పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి ఆనవాళ్లను చెరిపివేయాలనే రాజకీయ కక్షసాధింపుతో సీఎం, జిల్లా మంత్రులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) చొరవతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చెక్‌డ్యామ్ వల్ల నగరంలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగి, ప్రజలకు తాగునీటి ఎద్దడి తప్పిందని గుర్తుచేశారు.
ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా, శాస్త్రీయ ఆధారాలు లేకుండా హడావుడిగా దీన్ని కూల్చివేయడం వల్ల భవిష్యత్తులో ఖమ్మం నగరం తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మున్నేరు వరదల నుండి నగరానికి రక్షణగా రూ.525 కోట్ల వ్యయంతో 17 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ, చెక్‌డ్యామ్ వల్లే వరదలు వస్తున్నాయంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు.
రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి మున్నేరు వాగులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుండాల కృష్ణ, బచ్చు విజయ్ కుమార్, పగడాల నాగరాజు, బత్తుల మురళిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: కుంకీ ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్
Follow Us On: X(Twitter)

